జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి.. సర్జరీ జరిగిన ఆరు వారాల తర్వాత మరణించినట్టు అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు వెల్లడించారు. సోమవారం అతడు మృతి చెందాడని, శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఇన్ని వారాలపాటు అతడు బతికి ఉంటాడని తాము అనుకోలేదని బాధితుడి భార్య తెలిపారు. మేరీల్యాండ్‌కు చెందిన మాజీ నేవీ అధికారి లారెన్స్ ఫౌసెట్ (58) గుండె సంబంధిత అనారోగ్యంతో మరణ ముప్పును ఎదుర్కొన్నారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు సెప్టెంబరులో మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆస్పత్రికి తరలించారు. అతడ్ని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అక్కడి వైద్యులు సెప్టెంబరు 20న అమర్చారు. అయితే సర్జరీ జరిగిన అనంతరం తొలి నెలరోజులు ఆయన బాగా కోలుకోవడంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. చికిత్స తీసుకుంటూ కుటుంబసభ్యులతోనూ గడిపారు. దీంతో తమ ప్రయోగం విజయవంతమైందని మేరీ ల్యాండ్ వైద్యులు సంతోషించారు.
కానీ, మెల్లమెల్లగా ప్రతికూల సంకేతాలు మొదలయ్యాయి. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి చివరకు అక్టోబరు 30న మరణించారు. ‘అతను మాతో ఉండే సమయం తక్కువగా ఉందని తెలుసు.. ఇదే అతనికి చివరి అవకాశం.. ఇన్ని రోజులు బతుకుతాడని ఊహించలేదు’ అని ఫౌసెట్ భార్య అన్నా అన్నారు. ‘మన అనుభవం నుంచి మనం నేర్చుకున్నవాటిని ఎక్కువగా ఉపయోగించుకోవాలనేది ఫౌసెట్ చివరి కోరి.. తద్వారా మానవ అవయవం అందుబాటులో లేనప్పుడు ఇతరులకు కొత్త హృదయం కోసం అవకాశం కల్పించవచ్చు.. ఆ తర్వాత తనకు చికిత్స చేసిన డాక్టర్లు, నర్సుల బృందాన్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. మేము ఆయనను మిస్సవుతున్నాం’ అని మేరీల్యాండ్ క్లినికల్ డైరెక్టర్ బార్టెలే గ్రిఫ్త్ అన్నారు.
పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి కూడా రెండు నెలల వ్యవధిలోనే చనిపోయాడు. గతేడాది మేరీల్యాండ్ వైద్యుల బృందమే ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి అమర్చింది. జనవరి 7, 2022 చికిత్స జరిగితే.. మార్చి 8న రెండు నెలల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల దీర్ఘకాలిక కొరతకు పరిష్కారాన్ని అందిస్తుంది. అయినప్పటికీ ఈ ప్రక్రియలు సవాలుగా ఉంటాయి.. ఎందుకంటే రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడిచేసిన అవయవంపై దాడి చేస్తుంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాల మాదిరిగా ని చేస్తుందని శాస్త్రవేత్తలు ఆశించారు.
అవయవ మార్పిడి కోసం మొదట్లో కోతులపై శాస్త్రవేత్తలు ఆధారపడ్డారు. ఆ తర్వాత పందులపై దృష్టి సారించారు. ఈ జంతువుల్లో అవయవాల పరిమాణం చాలా వరకూ మానవ అవయవాలకు దగ్గరగా ఉంటాయి. పందుల గుండె కవాటాలనూ దశాబ్దాలుగా మనుషులకు అమరుస్తున్నారు. వాటి గుండెతో పాటు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను మనుషులకు ఉపయోగించేందుకు ప్రయోగాలు కొనసాగుతున్నాయి. కాలిన గాయాలకు గ్రాఫ్టింగ్ చేయడానికి పందుల చర్మాన్ని వినియోగిస్తున్నారు.