ధర్మవరం పట్టణంలో రవాణా శాఖకు సంబంధించి యూనిట్ ఆఫీస్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శనివారం అమరావతిలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలను యూనిట్గా తీసుకొని రవాణా ఆఫీసు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ యూనిట్ కార్యాలయం ధర్మవరంలో ఏర్పాటు చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.