రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి కామెంట్స్ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్ మీటింగ్ ఎందుకు? అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదని మండిపడ్డారు. అడ్డగోలు దోపిడీపై తప్ప కరువు నివారణ చర్యలు చేపట్టాలన్న సోయి లేదన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే... వారి సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 100 మండలాల్లో కరువు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. కరువు కోరల్లో చిక్కి రైతాంగం విలవిల్లాడుతున్న ఈ కష్టకాలంలో నిబంధనలను సడలించి అయినా యుద్ధప్రాతిపదికన రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని లోకేష్ పేర్కొన్నారు.