ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎంపీ విజయసాయి రెడ్డికి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తప్పులు చేస్తున్నది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఇసుక మాఫియాకి తెరలేపారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీకి వైసీపీ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తూ.. వైసీపీ బీజేపీ వైపు ఉందా లేదా తేల్చాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ముద్దాయిలు కాదా అని నిలదీశారు. డిస్టిల్ కంపెనీలు అన్నీ వైసీపీ కంట్రోల్‌లో నడుస్తున్నాయని ఆయన తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో వచ్చిన నిధులు నాడు నేడుతో దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వట్లేదని.. ఎర్రచందనం ఇష్టానుసారంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి రుషికొండపై అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. సీఎం ధనదాహానికి రైతులు బలి అవుతున్నారని విరుచుకుపడ్డారు. కడప కలెక్టర్ కూడా కేసీ కెనాల్‌లో నీళ్లులేవు వరి పంట వేయొద్దని ప్రకటన చేసినా కడప కరువు గురించి సీఎంకు గుర్తు రాలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టిక్కర్ కింగ్ లిక్కర్ కింగ్ సీఎం జగన్ అని.. కోడికత్తి కేసు పెద్ద డ్రామా అని అన్నారు. చంద్రబాబు బెయిల్‌పై మాట్లాడితే టీడీపీ వాళ్ళు అని ఆపాదిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం కంటే బ్రిటీష్ ప్రభుత్వం చాలా బెటర్ అంటూ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.