ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ డ్యూటీకి గైర్హాజరైన టీచర్,,,,షాకింగ్ సమాధానం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2023, 10:42 PM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, భద్రతా దళాల పాత్ర కీలకం. జాతీయ ప్రాధాన్యం ఉన్న ‘ఎన్నికల నిర్వహణ ప్రక్రియ’లో సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే, తప్పనిసరిగా పాటించాల్సిందే. అంతటి ప్రాధాన్యం ఉన్న ఎన్నికల విధుల పట్ల ఓ ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఎందుకు హాజరు కాలేదని ఉన్నతాధికారులు వివరణ కోరితే.. షాకింగ్ రిప్లై ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నాలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.


అఖిలేష్ కుమార్ తివారీ (35) సత్నాలోని అమర్‌పతన్‌లో మహుదర్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అక్టోబర్ 16, 17 తేదీల్లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అయితే, ఈ శిక్షణా కార్యక్రమానికి టీచర్ అఖిలేష్ హాజరు కాలేదు. అక్టోబర్ 27న సదరు ఉపాధ్యాయుడికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ఎన్నికల విధుల్లో ఎందుకు పాల్గొనలేదో, అతడిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.


‘నా జీవితమంతా భార్య లేకుండానే గడిచిపోతోంది. రాత్రులన్నీ వృథా అయిపోతున్నాయి. ముందుగా నేను పెళ్లి చేసుకోవడానికి ఓ పిల్లను చూడండి’ అంటూ టీచర్ అఖిలేష్ కుమార్ ఆ నోటీసులకు బదులిచ్చాడు. అతడి లేఖను చదివి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తనకు కట్నంగా ఎంత మొత్తం కావాలో కూడా లేఖలో పేర్కొన్నాడు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసినా పర్వాలేదని రాశాడు.


‘కట్నంగా నాకు 3.5 లక్షల రూపాయలు కావాలి. నగదు రూపంలో ఇవ్వవచ్చు. లేకపోతే నేరుగా బ్యాంక్ ఖాతాలో జమచేయవచ్చు. దీంతోపాటు రేవా జిల్లాలోని సింగ్రౌలీ టవర్ లేదా సమ్‌దరియాలో ఫ్లాట్ కోసం రుణం మంజూరు చేయించండి’ అని అఖిలేష్ కుమార్ రాసుకొచ్చాడు. ‘ఏం చేయాలి? నాకు పదాలు దొరకడం లేదు. మీరొక జ్ఞానసముద్రం’ అంటూ ఆయన ఆ ఉత్తరాన్ని ముగించాడు. ఈ వాక్యాన్ని హైలైట్ చేస్తూ రౌండాఫ్ కూడా చేశాడు. ‘నా బాధ మీకు బానే అర్థమవుతుంది’ అనే అర్థాన్ని వ్యక్తం చేశాడు. సత్నా జిల్లా కలెక్టర్ అనురాగ్ వర్మ నవంబర్ 2న టీచర్ అఖిలేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు అఖిలేష్‌తో మాట్లాడేందుకు ఫోన్ ద్వారా సంప్రదించారు. అప్పుడు మరో షాకింగ్ విషయం తెలుసుకొని వారు ఆశ్చర్యపోయారు. అఖిలేష్ అసలు మొబైల్ ఫోనే వాడరట. ఏడాది కాలంగా అఖిలేష్ ఫోన్ వాడటంలేదని అతడి సహోద్యోగి చెప్పారు. తనకు పెళ్లి కావట్లేదని అఖిలేష్ రెండేళ్లుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని అతడి సహోద్యోగి తెలిపారు. ‘లేకపోతే షోకాజ్ నోటీసుకు సమాధానంగా ఇంత విచిత్రమైన లేఖ ఎవరైనా రాస్తారా?’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదీ నిజమేగా! మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల్లో పురుషులు, మహిళల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. పెళ్లీడుకు వచ్చిన యువకులకు పిల్ల దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. లైఫ్‌లో బాగా సెటిలైనా.. జీవితంలో ఆనందంలేదని బాధపడుతున్నారు. ప్రభుత్వాలకు బహిరంగంగా లేఖలు కూడా రాశారు. ఈ టీచర్ అఖిలేష్ బాధ కూడా అలాంటిదే..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com