ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతను మావోయిస్టులు హత్యచేశారు. నారాయణ్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్ దూబేను నక్సల్స్ కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. తొలి దశ పోలింగ్‌కు కేవలం మూడు రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కలకలం రేగుతోంది. శనివారం కౌశల్‌నార్ ప్రాంతంలో దూబే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే మావోలు ఈ దారుణానికి పాల్పడ్డారు. కౌశల్‌నార్ నుంచి జిల్లా పంచాయతీకి దూబే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
మావోయిస్ట్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 7న మొదటి దశ, నవంబరు 17న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో తొలి దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి విడత ప్రచారానికి నవంబరు 5తో గడువు ముగియనుంది. నవంబరు 7న పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం 48 గంటల్లోనే ప్రచారాన్ని ముగించాలి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
గత నెలలో రాజనందగావ్ జిల్లాలోనూ ఓ బీజేపీ నేత నక్సల్స్ చేతిలో హతమయ్యారు. మాన్‌పూర్‌లోని సర్‌ఖేడాలో బీజేపీ నేత బిర్జు తారమ్.. నవరాత్రుల పూజ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారి కాచి చంపేశారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నక్సలైట్లు దారిలో అతడిని చుట్టుముట్టి కాల్పులకు పాల్పడ్డారు. మాన్‌పూర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఔధి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. చాలా రోజుల తర్వాత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు హత్యకు గురికావడంతో.. భయాందోళన వాతావరణం నెలకొంది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం ముగిసిన కొద్ది సేపటికే తాజా ఘటన జరగడం గమనార్హం.