ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లో 900 గ్రూప్‌-2 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2023, 11:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఏపీపీఎస్సీకి సైతం స్వేచ్ఛనిచ్చింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పిన వివరాల ప్రకారం.. 900 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు భర్తీకి సంబంధించి నవంబర్‌ నెలాఖరులోపు ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. కాబట్టి నోటిఫికేషన్‌ విడుదల కోసం అభ్యర్థులు ఎదురుచూడకుండా ప్రిపరేషన్‌ ప్రారంభించడం మంచిది. గ్రూప్‌ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని.. 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని కమిషన్‌ వెల్లడించింది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని.. ఈ నెలలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇవికాక.. గ్రూప్‌-1 ఉద్యోగాలు సుమారు 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలా మొత్తం 1603 వరకు పలు శాఖల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. (మొత్తం 1603 పోస్టులు.. శాఖల వారీగా ఖాళీల వివరాలివే)


డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను నవంబర్‌ నెలలో విడుదల చేయనున్నట్టు గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ వెల్లడించారు. గ్రూప్‌–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com