ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక అధికారిణి ప్రతిమ హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ డ్రైవర్ అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2023, 11:19 PM

కర్ణాటక గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కేఎస్‌ ప్రతిమ హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బెంగళూరులోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో శనివారం రాత్రి మహిళా అధికారిణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన అరగంటకే ఆమెను ఇంట్లోనే దుండుగుడు హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తాజాగా, ఈ ఘటనలో ఓ అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ప్రతిమ కారు డ్రైవర్‌గా పనిచేశాడని, పది రోజుల కిందటే తొలగించారని పోలీసులు చెప్పారు. ఉద్యోగం నుంచి తొలగించిందనే కోపంతో తానే ఈ హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్టు సమాచారం.


బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ.. ‘గనుల భూగర్భ శాఖ అధికారిణి ప్రతిమ హత్య కేసులో ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నాం.. కారు డ్రైవర్‌గా పనిచేసిన అతడ్ని వారం పది రోజుల కిందటే తొలగించారు’ అని అన్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. అనుమానితడు గత ఐదేళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తనను తొలగించడంతోనే కక్షగట్టి హత్య చేసినట్టు చెప్పినట్టు తెలుస్తోంది. అనుమానితుడ్ని కిరణ్‌గా గుర్తించారు. హత్య తర్వాత అతడు చామరాజనగర్‌కు పారిపోయినట్టు గుర్తించారు.


మరోవైపు, ప్రతిమ సహచర సీనియర్ అధికారి స్పందిస్తూ.. ఆమె డైనమిక్ లేడీ అని అన్నారు. కర్ణాటక అటవీ పర్యావరణ విభాగం సీనియర్‌ అధికారి దినేశ్‌ మాట్లాడుతూ..‘ఆమె మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతిమ చాలా ధైర్యవంతురాలు.. తనిఖీలు, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారు. తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కూడా కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఆమెకు శత్రువులు ఎవరూ లేరు’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో ఇటీవల జరిపిన తనిఖీలే ప్రతిమ హత్యకు కారణమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


కాగా, రామనగర జిల్లాలో పనిచేసిన కేఎస్ ప్రతిమ బదిలీపై ఇటీవలే బెంగళూరుకు వచ్చారు. శనివారం రాత్రి 8 గంటలకు విధులు ముగించుకుని దొడ్డకల్లసంద్రలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఆమె హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఊపిరి ఆడకుండా చేసిన నిందితుడు, గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఐదేళ్లుగా ఆమె ఒంటరిగానే ఉంటున్నారని, అసలేం జరిగిందో తెలిసిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.


ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ప్రతిమ స్పందించకపోవడంతో ఆమె సోదరుడు ప్రతీక్‌... ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే వేరేవారికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి చూసేసరికి ప్రతిమ విగతజీవిగా పడి ఉంది. ఈ హత్యపై సమగ్ర దర్యాప్తునకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా తుడకి గ్రామానికి చెందిన ప్రతిమ.. జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి గనులు శాఖలో జియాలజిస్ట్‌గా చేరారు. 18 ఏళ్ల కిందట తీర్థహళ్లికి చెందిన సత్యనారాయణతో వివాహమైంది. భర్త, ఆమె కుమారుడు తీర్థహళ్లిలో ఉంటున్నారని ప్రతీక్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com