ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి మండిపడ్డారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ట్విట్టర్ వేదికగా పురందేశ్వరి తీరును ఎండగట్టారు. కులం, కుటుంబం చుట్టే వారి రాజకీయాలు ఉన్నాయన్నారు. పురందేశ్వరి గారు..కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు...మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే. మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే". మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు...స్వార్థం తప్ప. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి...పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా ! అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.