పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రవాదులు హతం అవుతున్నారు. భారత్‌లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై దాడి చేయడం వెనుక మాస్టర్ మైండ్ అయిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ముజాహిద్ అనుమానాస్పద స్థితిలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఉగ్రవాది ముజాహిద్‌ని అతి దారుణంగా హత్య చేసినట్లు పాక్ అధికారులు గుర్తించారు. తల లేని మొండాన్ని గుర్తించినట్లు తెలిపారు. అయితే గత 20 నెలల్లో 18 మంది భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో మృతి చెందారు.
2018లో భారత్‌లోని సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై దాడి జరిగింది. ఈ దాడి వెనక ఉన్న వ్యూహకర్తను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణ స్థితిలో హత్య చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఖ్వాజా షహిద్ అలియాస్ మియా ముజాహిద్ తాజాగా హత్యకు గురయ్యాడు. గతంలో ఈ మియా ముజాహిద్.. సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై దాడి చేయించడంలో ప్రధాన సూత్రదారిగా ఉన్నారు. ఈ లష్కర్ ఏ తోయిబా చేసిన ఉగ్రదాడిలో అప్పట్లో ఐదుగురు సైనికులు సహా ఒక పౌరుడు అమరులు అయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం లోయ ప్రాంతంలో నివసిస్తున్న మియా ముజాహిద్ విగత జీవిగా కనిపించాడు. మియా ముజాహిద్‌కు చెందిన మృతదేహాన్ని తలలేని స్థితిలో స్థానిక అధికారులు గుర్తించారు. అయితే మియా ముజాహిద్‌ను అత్యంత తీవ్రంగా హింసించి దారుణంగా చంపినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మియా ముజాహిద్‌ను కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. అయితే అతడి బాడీగార్డ్‌లను ఏమార్చి మరీ ఎత్తుకెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే పాకిస్థాన్ సైన్యం, భద్రతా బలగాలు రంగంలోకి దిగి మియా ముజాహిద్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి మియా ముజాహిద్ మృతదేహాన్ని గుర్తించారు.
పాకిస్థాన్‌లోని మియా ముజాహిద్ సహా 18 మంది ఇప్పటి వరకూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు గత 20 నెలల వ్యవధిలో హత్యకు గురైనట్లు పాక్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజర్‌కు అత్యంత సన్నిహితుడైన దావుద్ మాలిక్‌ను పాకిస్థాన్‌లోని నార్త్ వజీరిస్థాన్‌లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. ఇక కరాచీ నగరంలో హిజ్బుల్ చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితడు ముఫ్తీ ఖైజర్ ఫారుఖీ నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన లష్కరే ఉగ్ర సంస్థకు భారీ ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు.. ఐసీ-814 విమానం హైజాక్‌లో కీలక పాత్ర పోషించిన జైషే మహమ్మద్ ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను కూడా పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపారు. ఇలా వరుస హత్యలు పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐను తీవ్ర ఇరకాటంలో పడేశాయి. ఈ దాడులు, హత్యల నేపథ్యంలో ఉగ్రవాదులను ఐఎస్ఐ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.