భారత్ తన పలుకుబడిని ఉయోగించి గాజాలో ఇజ్రాయేల్ రక్తపాతాన్ని నివారించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కోరారు. సోమవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన రైసీ.. పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయేల్ చర్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ప్రధాని మోదీ, రౌసీ సంభాషణల వివరాలను ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్ రీడౌట్ ప్రకారం.. పాశ్చాత్య వలసవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసిన పోరాటాలను, ప్రపంచంలోని అలీనోద్యమ వ్యవస్థాపక దేశంగా చేసిన ప్రయత్నాలను మోదీతో సంభాషణల్లో రైసీ గుర్తుచేసుకున్నారు. ‘ఈ రోజు గాజాలోని అణగారిన ప్రజలపై జియోనిస్ట్ నేరాలను అంతం చేయడానికి భారత్ తన అన్ని సామర్థ్యాలను ఉపయోగిస్తుందని భావిస్తున్నాం’ అని చెప్పినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. తక్షణ కాల్పుల విరమణ, దిగ్బంధనం ముగించి గాజాలోని అణగారిన ప్రజలకు సహాయాన్ని అందించడానికి ప్రపంచం చేసే ఏ ఉమ్మడి ప్రయత్నానికైనా తమ మద్దతు ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
‘పాలస్తీనా ప్రజలపై జరుగుతోన్న మారణకాండ ప్రపంచంలోని అన్ని స్వేచ్ఛా దేశాలకు కోపం తెప్పించింది.. ఈ హత్యలు అదనపు ప్రాంతీయ పరిణామాలకు దారితీస్తాయి’ అని రౌసీ అన్నారు. అణగారిన, అమాయక మహిళలు, పిల్లలను చంపడం, ఆస్పత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలు, నివాసన సముదాయాలపై దాడులను ఖండించదగినవి, ఆమోదయోగ్యం కానివి అని ఆయన అన్నారు. ‘పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులు ఆక్రమించుకుంటున్న జియోనిస్ట్ పాలనను ఎదుర్కోవడానికి చట్టబద్ధమైన హక్కును కలిగి ఉన్నాయి.. అణచివేత నుంచి విముక్తి కోసం పాలస్తీనా ప్రజల పోరాటానికి అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలి’ అని రైసీని ఉటంకిస్తూ ఇరాన్ రీడౌట్ పేర్కొంది. ‘నాజీ జర్మనీకి వ్యతిరేకంగా యూరోపియన్ దేశాల పోరాటం ప్రశంసనీయం.. వీరోచిత చర్య, అయితే పిల్లలను చంపడం, నేరపూరిత జియోనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల ప్రతిఘటన ఖండించబడిందా?!’ అని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. భారతదేశంతో ఇరాన్ సంబంధాలను ‘వ్యూహాత్మక’ దృక్పథంగా రైసీ అభివర్ణించారు. సహకార అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా జాప్యాన్ని నివారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఉత్తర-దక్షిణ కారిడార్ ప్రాముఖ్యతను, ఈ ప్రాంతంలోని అన్ని దేశాలకు దాని ప్రయోజనాలను వివరించిన ఇరాన్ అధ్యక్షుడు.. చాబహార్ పోర్ట్‌తో సహా స్థిరమైన ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ మరింత దృష్టి సారిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడం, మానవతా సహాయాన్ని నిరంతరం అందించడం, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించే ప్రాముఖ్యతను ఈ సందర్భంగా రైసీకి ప్రధాని నొక్కి చెప్పారు. చాబహర్ పోర్ట్ సహా ఇరాన్-భారత్ ద్వైపాక్షిక సహకార పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు.