కర్నూలు జిల్లాలో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది.. ఆ వజ్రాన్ని రూ.10 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. అయితే స్థానికంగా మరో వాదన కూడా వినిపిస్తోంది. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు.
కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా వానలు పడటంతో వజ్రాల వేట మళ్లీ ప్రారంభమైంది. జిల్లాతో పాటూ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనాలు వజ్రాల కోసం గాలిస్తున్నారు. అయితే ఎక్కువమంది రైతులు, కూలీలకు వజ్రాలు దొరుకుతున్నాయి. చాలా రోజుల తర్వాత వర్షాలు కురవడంతో భూమిలో ఉండే వజ్రాలు బయటకు వస్తాయని స్థానికులు అంటున్నారు. కర్నూలు జిల్లోనిలా తుగ్గలి మండలంలోని గ్రామాల్లో ఈ వజ్రాల వేట ఎక్కువగా సాగుతుంది. జొన్నగిరి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, పగిడిరాయితో పాటు మరికొన్ని చోట్ల వజ్రాల కోసం గాలిస్తున్నారు. మద్దికెర మండలంలో బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు ఉంటాయని నమ్మకం.
వజ్రాలు దొరికిన వెంటనే స్థానికంగా ఉండే ఏజెంట్ల ద్వారా వ్యాపారులకు సమాచారం వెళుతోంది. దొరికిన వజ్రం బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో విలువ ఉంటుంది.. దాన్ని బట్టి వ్యాపారులు వజ్రాలు దొరికిన వారికి డబ్బుల్ని చెల్లిస్తారు. ఇలా పొలాల్లో దొరికిన వజ్రాలకు సంబంధించి అధికారికంగా కొనుగోళ్లు ఉండవు. అంతేకాదు కొందరు వ్యాపారులు వజ్రాలు దొరికిన రైతులు, కూలీలను మోసం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వనిపిస్తున్నాయి. గతంలో విలువైన వజ్రాలకు రూ.కోటి వరకు చెల్లించిన సందర్భాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.