ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రాకపోగా.. మరింత తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం అయినా గాలిలో పొగమంచు, కాలుష్యం వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కమ్ముకున్న పొగమంచుకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా తాజాగా అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలను విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు ఆవరించి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు దట్టంగా పొగమంచు కమ్ముకున్నట్లు నాసా ఫోటోలు పేర్కొంటున్నాయి. అయితే ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో మాత్రమే ఎక్కువగా పొగమంచు ఉందని తెలిపింది. ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ మరింత తీవ్రంగా ఉందని వెల్లడించింది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా గాలిలో పొగమంచు, కాలుష్యం కలిసి పొర లాగా కనిపిస్తోంది.
ఇక ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఉత్తర భారత రాష్ట్రాల్లో పంట వ్యర్థాల్ని తగలబెట్టడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాదిన ఇటీవలి కాలంలో పంట దగ్ధం 740 శాతం పెరిగిందని.. అక్టోబర్ 29 వ తేదీన ఒక్కరోజే వెయ్యికి పైగా ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక దేశంలో దీపావళి పండుగ వస్తున్న వేళ.. బాణాసంచా పేలుళ్లతో గాలి నాణ్యత మరింత దిగజారిపోవచ్చని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులను పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోకపోతే ఢిల్లీ నివసించడం కూడా కష్టం అవుతుందనే భయాలు నెలకొంటున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్న ఫోటోలతోపాటు గతంలో తీసిన ఫోటోలను కూడా నాసా విడుదల చేసింది. ఇందులో గతంలో తీసిన ఫోటోల్లో ఆకుపచ్చ రంగులో కనిపిస్తుండగా.. తాజాగా తీసిన ఫోటోల్లో మాత్రం పొగమంచుతో బూడిద వర్ణం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు కేజ్రివాల్ ప్రభుత్వం సెలవులను పొడిగించింది. నవంబర్ 9 వ తేదీ నుంచి 18 వరకు సెలవులను పొడిగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మితిమీరిన కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.