మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండెపోటుకు గురైన ఓ సంస్థ సీఈఓ.. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పంచుకున్నాడు. ఎక్స్‌ప్రెస్ న్యూస్ ప్రకారం... యూకే హాకీ వేల్స్ సీఈఓ పాల్ వాపమ్.. స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర ఉదయం రన్నింగ్ చేస్తుండగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ద్వారా భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె తక్షణమే ఆసుపత్రికి తరలించింది. ‘నేను మామూలుగా ఉదయం 7 గంటలకు రన్నింగ్ కోసం వెళ్లాను.. ఐదు నిమిషాలలో నాకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది.. గుండె బిగుసుకుపోయినట్టు అనిపించింది.. ఆపై కింద కూలబడిపోయాను.. నేను నా భార్య లారాకు స్మార్ట్ వాచ్ ద్వారా ఫోన్ చేసి సమాచారం ఇచ్చాను.. అదృష్టవశాత్తూ ఆమెకు నేను కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉన్నాను.. కాబట్టి ఆమె హుటాహుటిన నన్ను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగలిగింది.. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో ముప్పు తప్పింది’ పాల్ అన్నారు. ధమనుల్లో ఒకటి పూర్తిగా పూడుకుపోవడం వల్ల తనకు గుండెపోటు వచ్చినట్టు తర్వాత వైద్యులు నిర్ధారించారని చెప్పారు.
కార్డియాక్ సెంటర్‌లోని కాథెటరైజేషన్ ల్యాబొరేటరీకి తీసుకెళ్లి ధమనిని అన్‌లాగ్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఇంటికి వెళ్లే ముందు కోలుకోవడానికి ఆరు రోజులు కరోనరీ యూనిట్‌లో ఉన్నానని వెల్లడించారు. చికిత్స తర్వాత రిహాబిలిటేషన్‌లో భాగంగా ఆస్పత్రికి వెళ్లి గుండెకు సంబంధించిన వ్యాయామాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు. ‘'నేను అధిక బరువుతో లేను.. నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను.. నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు ఇది కొంచెం షాక్‌గా ఉంది. ఇది నిజంగా నా కుటుంబం సహా అందరికీ షాక్‌ని కలిగించింది’ అని వ్యాఖ్యానించారు.
అండగా నిలిచినందుకు తన భార్య, ఆసుపత్రి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను పొందిన సంరక్షణ అద్భుతమైంది. నేను సిబ్బంది గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నన్ను సకాలంలో ఆసుపత్రికి తీసుకువచ్చినందుకు నా భార్యకు నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే అది ఆమెకు కూడా షాక్‌గా ఉంది. రెండు గంటల పాటు తీవ్ర ఆందోళన నెలకొంది. అత్యవసర విభాగం అవసరమైనప్పుడు సిబ్బంది అండగా ఉంటారని తెలుసుకోవడం చాలా భరోసానిస్తుంది. అక్కడ సిబ్బంది చాలా అద్భుతంగా ఉన్నారు.. వారందరికీ నేను పెద్ద కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. స్మార్ట్‌వాచ్‌లు ప్రమాదంలో ఎదుర్కొన్న వారి ప్రాణాలు కాపాడానికి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. హృదయ స్పందన రేటు, ఈసీజీ, మరిన్నింటిని కొలిచే సెన్సార్‌లను ఉపయోగించడం ద్వారా శరీరంలో అసాధారణ మార్పులను పసిగట్టి అప్రమత్తం చేసిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.