గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ టాప్‌లో నిలిచింది. అయితే ఇటీవల ఢిల్లీలో మోస్తరు వర్షం పడటంతో గాలి నాణ్యత కొంత మెరుగైంది. కానీ దీపావళి పండగ సందర్భంగా ప్రభుత్వం, సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను బేఖాతరు చేసిన ఢిల్లీ వాసులు భారీగా బాణసంచా కాల్చడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీపావళి ఎఫెక్ట్‌తో మరోసారి ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. ఇక దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీతోపాటు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో టాప్ 10 లోకి చేరిపోయాయి.
ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకుని తీవ్రంగా సతమతం అవుతున్న ఢిల్లీని దీపావళి వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గత శనివారం ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురవడంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే తాజాగా దీపావళి సందర్భంగా ఢిల్లీ, ఆ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు టపాసులు కాల్చడంతో పరిస్థితి మునుపటిలాగే మారింది. ఢిల్లీ ప్రభుత్వం, సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోని ఢిల్లీ వాసులు ఆదివారం భారీగా టపాసులు కాల్చడంతో రాజధాని ప్రాంతంలో మరోసారి దట్టమైన కాలుష్యం అలుముకుంది. దీంతో గాలిలో వాయునాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఇక ఆదివారం రాత్రి ఏకంగా 680కి చేరినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దీంతోపాటు దీపావళి పండగ వేళ దేశంలో విచ్చలవిడిగా టపాసులు కాల్చడంతో మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. ఈ క్రమంలోనే స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్ నుంచి 3 నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాలు కూడా టాప్-10 లోకి చేరాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420 నమోదు కాగా.. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాలుగో స్థానం, 163 ఏక్యూఐతో ముంబై 8 వ స్థానంలో నిలిచింది.
వాతావరణంలో గాలి నాణ్యతను ఏక్యూఐతో కొలుస్తాం. ఈ ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే కాలుష్యం లేకుండా పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు పరిగణిస్తారు. ఇక ఏక్యూఐ 400 నుంచి 500 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉన్నట్లు భావిస్తారు. ఈ ప్రమాదకర స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యంగా ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక ఏదైనా వ్యాధులతో బాధపడే వారికి ఇది అత్యంత ప్రమాదకరమని చెబుతారు. 150 నుంచి 200 ఏక్యూఐ మధ్య వాయు నాణ్యత నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.