మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండగా.. ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌పై మాజీ సీఎం, పీసీసీ నేత కమల్ నాథ్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. త్వరలోనే సీఎం పాత్ర నుంచి శివరాజ్‌కు ఉద్వాసన తప్పదని కమల్ నాథ్ జోస్యం చెప్పారు.ముఖ్యమంత్రి మంచి నటుడని, కాబట్టి ఆయనకు ఉపాధి లేకపోవడం అనేది ఉండదని ఛలోక్తులు విసిరారు. ఆదివారం సాగర్ జిల్లా రెహ్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత విరుచుకుపడ్డారు. ‘సీఎం పదవి కోల్పోయినా శివారాజ్ సింగ్‌కు ఉద్యోగానికైతే ఎటువంటి ఢోకాలేదు. ఆయన చాలా మంచి నటుడు. ముంబయి వెళ్లి నటనను కెరీర్‌గా ఎంచుకుంటే రాణిస్తారు.. మధ్యప్రదేశ్‌కు మంచి పేరు వస్తుంది’ అని కమల్‌నాథ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, పోలీసులు, డబ్బు, అధికార యంత్రాగం సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని దుయ్యబట్టారు.
18 ఏళ్ల బీజేపీ పాలనలో దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిన మధ్యప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలు నవంబర్ 17న జరుగనున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను శివరాజ్ నిలుపుకోలేదని, ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని కమల్‌నాథ్ ధ్వజమెత్తారు. యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చేసిన వాగ్దానం ఏమైందని ఆయన నిలదీశారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. చౌహన్ ఉద్దేశాలు, జెట్ స్పీడ్‌లో చేస్తున్న ప్రకటనలను జాగ్రత్తగా గమినించి ప్రజలు ఓట్లు వేయాలని కమల్‌నాథ్ సూచించారు. శనివారం బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప్ పాత్ర’పై కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే కాపీ చేశారని ఆరోపించారు. ‘అబద్ధం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. శివరాజ్ జీ మహిళలకు (లాడ్లీ బహనా యోజన కింద) రూ. 3,000 ఇస్తానని హామీ ఇచ్చే హోర్డింగ్‌లు, బ్యానర్‌లు మధ్యప్రదేశ్‌లోని ప్రతి నగరం లేదా పట్టణంలో ఏర్పాటు చేశారు.. కానీ, ఈ రోజు మీరు విడుదల చేసిన సంకల్ప్ పాత్రలో దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు’ అని కమల్ నాథ్ ప్రశ్నించారు. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.