చంద్రబాబు నాయుడు చేసిన పాలనకు, జగన్ మోహన్ రెడ్డి చేసిన నాలుగున్నరేళ్ల పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని మంత్రి విశ్వరూప్ అన్నారు. అయన మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రలో 14 లక్షలు పెన్షన్ లను వైఎస్ ఆర్ 60 లక్షలకు పెంచారని, అలాగే జగన్ సీఎం అయ్యాక అంచలంచెలుగా పింఛన్ మొత్తాన్ని రూ. 2,750కి పెంచారని, త్వరలోనే రూ. 3,000 చేయబోతున్నారని అన్నారు. సంక్షేమం అమలు విషయంలో జగన్ పొరుగు రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచారని వివరించారు. రూ. 25 వేల కోట్ల డ్వాక్రా రుణ మాఫీ, రూ. 56 కోట్ల రైతు రుణ మాఫిని జగన్ చేయగా, చంద్రబాబు గత పాలనలో అందర్నీ నమ్మించి మోసగించారని విమర్శించారు. పరిపాలనలో సంక్షేమానికి జగన్ సరికొత్త దిశ, దశను నిర్దేశం చేసారని విశ్వరూప్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్ధానాలను అమలు చేయక మోసం చేసిన నేత చంద్రబాబు అయితే, హామీలన్నింటిని తూచా తప్పకుండా అమలు చేసిన నిజాయితీ గల నేత జగన్ అని వివరించారు. మైనార్టీలకు, గిరిజనులకు మంత్రి పదవి నాలుగున్నరేళ్లపాటు ఇవ్వకుండా సామాజిక అన్యాయం చంద్రబాబు ఇస్తే, జగన్ అన్ని వర్గాలకు కేబినెట్ లో స్థానం కల్పించడంతో పాటుగా డిప్యూటీ సీఎం పదవులిచ్చి సామాజిక న్యాయం చేసారని వివరించారు. మరోసారి జగన్ సీఎం కాకపోతే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉన్నందున మరోసారి మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వరూప్ అన్నారు.