విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదంపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు. భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం అని అన్నారు. నిర్లక్ష్యంతో మత్య్సకారుల ప్రాణాలకు ముప్పుతేవద్దని హితవుపలికారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణమన్నారు. వరుస ప్రమాదాలు జరుగున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు. విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని.. వాటిని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని విమర్శించారు. సీఎం జగన్ రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపైనున్న శ్రద్ధ ప్రజల భద్రతపై పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోందని.. బోట్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కొత్త బోట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. మరోమారు అగ్నిప్రమాదాలకు తావులేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.