ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26, 27 తేదీల్లో తిరుపతి సందర్శించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తదుపరి తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారన్నారు. 27వ తేదీ ఉదయం వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుంచి హైద్రాబాద్ బయలుదేరి వెళతారని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన విస్తృత, పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. 27వ తేదీ ఉదయం తిరుమలతో స్వామి వారిని దర్శించుకునే సమయంలో వీవీఐపీల పర్యటనల నిబంధనల ప్రకారం అవసరమైన పక్కా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవోని ఆదేశించారు. సమావేశంలో దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.