ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంలో ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం బలుసుపాడు రోడ్డు నుంచి పట్టణంలోకి వస్తున్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. బస్సులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్తో పొగలు కమ్మేశాయి. ఈ సమయంలో బస్సులో దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నారు. పొగలను గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు ముందుగా స్పందించి బ్యాటరీ వైర్లను తెంచేశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.