ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పలు శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. విశాఖకు పాలనా రాజధానిని మారుస్తున్నట్టు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు? దేని కోసం వస్తున్నారని గంటా ప్రశ్నించారు. అడ్డదారిలో విశాఖకు రావాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఇందులో రాజకీయ లబ్ధి తప్ప, ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతోందని... ఈ 3 నెలల ముచ్చట కోసం ప్రజాధనాన్ని తగలేస్తున్నారని విమర్శించారు. విశాఖలో పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. విశాఖ ప్రజల ఆవేదన వైసీపీకి పట్టడం లేదని అన్నారు.