లంచం తీసుకుంటూ పట్టుబడిన ఓ అవినీతి అధికారి సూసైడ్ చేసుకున్నాడు. అధికారుల కళ్లుగప్పి పారిపోయి చెన్నైలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్రారెడ్డి.. తన ఆస్తిని మార్చిలో రిజిష్టర్ చేసుకున్నారు. అందుకుగాను అప్పట్లో 30 వేలు లంచం ఇచ్చారు. స్టాంపు డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆడిట్‌లో తేలిందంటూ.. మరో లక్ష ఇవ్వాలని డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి సురేంద్రారెడ్డిపై ఒత్తడి తెచ్చారు.
చివరికి 50 వేలకు ఒప్పందం కుదరగా.. ఈనెల 16న బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈనెల 22న సాయంత్రం సురేంద్రారెడ్డి రూ. 10 వేలు తీసుకుని సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లాడు. ఆ డబ్బును డాక్యుమెంట్ రైటర్‌కు ఇవ్వాలని శ్రీనివాస్ నాయక్ సూచించారు. ఆ డబ్బులు డాక్యుమెంట్ రైటర్ నుంచి సబ్‌రిజిస్ట్రార్‌కు అందగానే ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్‌రిజిస్ట్రార్‌తో పాటు డాక్యుమెంట్ రైటర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు శ్రీనివాస్ నాయక్‌ను, శ్రీహరిని ఏసీబీ అధికారులు విచారించగా.. భోజన విరామ సమయంలో వాళ్ల కళ్లుగప్పి శ్రీనివాస్ నాయక్ అక్కడి నుంచి పరారయ్యారు. చెన్నై చేరుకున్న శ్రీనివాస్ నాయక్ అక్కడే ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై పోలీసులు.. ఏపీలో పోలీసులకు సమాచారం అందించగా.. శ్రీనివాస్ నాయక్ డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు పోలీసులు చెన్నై బయలుదేరి వెళ్లారు.