వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.... రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన సాగిస్తోంది. ఈ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల ఎన్నడో నిస్పృహలో పడిన వర్గాలు, జీవితంలో మార్పు రాదనుకున్న వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ఓటు వేయని వారికీ సంక్షేమం అందింది. నా వాడు అధికారంలో లేడు కాబట్టి తలవంచుకొని ఉండాలనే పరిస్థితి లేదు. ఎవరికీ నయాపైసా లంచం ఇవ్వకుండా సంక్షేమం అందే స్థితిని తీసుకురాగలిగాం. ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతినకుండా సంక్షేమం అందించడంలో ఈ ప్రభుత్వం విజయవంతమైంది. గతంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీలు టిడిపి కార్యకర్తలను పెట్టి వారి గుప్పెట్లోనే పథకాలు పెట్టారు. కలెక్టర్ దగ్గరకెళ్లినా జన్మభూమి కమిటీలవద్దకే వెళ్లాలనే దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎవరూ ఎవరి వద్దా తలవంచి దండం పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి, సంక్షేమం అందుకోవడంలో ఓ గౌరవం ఉంది. ఇది ఇతర రాష్ట్రాల్లో లేదు. ఎవరూ ఉద్యమాలు చేయకుండానే సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఎవరూ కోరకుండానే గతంలో విద్య ప్రయివేటుపరం, వ్యాపారంగా మారిపోయింది. దీనికి టీడీపీనే కారణం. నేడు జగన్ ప్రభుత్వం విద్యవ్యవస్థలో మార్పులు తెచ్చింది. స్కూళ్లన్నీ ఆధునికంగా మారాయి. ప్రపంచంలో పోటీని తట్టుకొనే సిలబస్ వచ్చింది. చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదనే స్థితి వచ్చింది. ప్రయివేటు వ్యక్తుల వద్ద నుంచి రూ.12,800 కోట్లు పెట్టి భూమిని కొని 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ఇలా పేదల కోసం చంద్రబాబు ఏనాడూ చెయ్యలేదు. 100 సంవత్సరాల కిందట బ్రిటీష్ వారు చేసిన సర్వేమీదే భూమి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి రీసర్వే చేస్తున్నాం. విద్యుత్ రేట్లు దేశంలో ఏ రాష్ట్రంలో మనకంటే చవకగా ఉన్నాయి? విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ధరలు దేశమంతా ఒకేలా ఉన్నాయి. ఇతర విషయాలు చంద్రబాబు విమర్శించలేకపోతున్నారు. అందుకే ఈ విషయాలే చెబుతున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మరో 20 ఏళ్లు ఈ ప్రభుత్వం కొనసాగితే సమాజంలో చాలా మార్పు వస్తుంది అని తెలిపారు.