ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 20న ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందు మంగళవారం విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ నేతృత్వంలో 16వ కోర్టులో ఐటెం నం.64 కింద ఈ కేసు లిస్ట్ అయింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులను టీడీపీ అకౌంట్‌లకు మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. బెయిల్ కేసు విచారణ సమయంలో హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతో పాటు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో పొరబడిందని, అందువల్ల చంద్రబాబు బెయిల్‌ను రద్దుచేయాలని కోరింది ప్రభుత్వం.
కేసు మెరిట్స్‌పై అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించింది కాబట్టి ఆ తీర్పును కొట్టేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ బేలా ఎం.త్రివేది చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (సెక్షన్ 17-ఏ), ఫైబర్‌నెట్ కేసులో దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధబోస్‌తో కలిపి విచారించిన ధర్మాసనంలో సభ్యులు. ఆ ధర్మాసనం క్వాష్ పిటిషన్‌పై అక్టోబరు 17న విచారణ ముగించి తీర్పు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ లోపు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో ఆ తీర్పు కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు. ఇంతలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడం.. అయితే ఈ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.