తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో వేట కుక్కలు దుప్పిపై దాడికి దిగాయి. చుక్కల దుప్పిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ కుక్కలు స్థానికులపైకి దూసుకెళ్లాయి.. వారు చాకచక్యంగా వాటిని తరిమేసి దుప్పిని కాపాడారు. ఆ వెంటనే స్థానికులు దుప్పిని రక్షించి గ్రామంలోనే ఉంచారు.. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇటీవల కాలంలో వేట కుక్కలు పశువులు, మేకలు, కోళ్లను కూడా వదలకుండా వరుసగా దాడులు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వేట కుక్కల బెడదతో భయపడాల్సి వస్తోందని.. మూడు రోజుల క్రితం కూడా మరో దుప్పిని కుక్కలు వేటాడి చంపినట్లు వారు చెబుతున్నారు. చంద్రగిరికి సమీపంలోనే అటవీ ప్రాంతండా కూడా ఉండటంతో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరు వేటగాళ్లు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి వణ్యప్రాణులను వేటాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వేటగాళ్లపై నిఘా పెట్టి వన్య ప్రాణుల్ని వారి బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.