ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ చెబుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు రోజులు వాయువ్యంగా పయనించి వచ్చేనెల ఒకటో తేదీకల్లా తుఫాన్‌గా బలపడనుంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని వచ్చే 4వ తేదీకల్లా తీవ్ర తుఫాన్‌గా బలపడుతుందని.. 5వ తేదీకల్లా ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర తుఫాన్‌గా దాటుతుందని భారత వాతావరణ శాఖ, జీఎఫ్‌ఎస్ సంస్థ మోడళ్ల మేరకు అంచనా వేశారు. తీరం దాటిన తరువాత తీవ్ర తుఫాన్ బలహీనపడుతుంది అంటున్నారు.
ఒడిశా, ఏపీ, తమిళనాడు తీరాలకు ఆనుకుని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం.. మధ్య భారతం మీదుగా పడమర గాలులు వీస్తున్నందున తుఫాన్ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందని లేదా బలహీనపడుతుందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నంద్యాల, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షాలతో రైతులు ఆందోళనలో ఉన్నారు.