‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరిట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని ఆరోపిస్తూ జర్నలిస్ట్ కట్టెపోగు వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్లు లాయర్లు ఉమేశ్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయడం, ప్రజా ధనాన్ని వినియోగిస్తుండటం సహా తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పని చేయాలని సజ్జల బహిరంగంగా చెప్పారని పిటిషనర్ ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కీర్తించడానికి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
నవంబరు 9 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలో రోజుకొక సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోజూ ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈవో, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్ నోడల్ అధికారులుగా ఉంటారు.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 19 వరకూ కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa