పులివెందుల టీడీపీ ఇంచార్జీ బీటెక్ రవికి కడప జిల్లా కోర్టు బెయల్ మంజూరు చేసింది. సుమారు 15 రోజులుగా ఆయన కడప జిల్లా జైల్లో ఉన్నారు. రెండు రోజుల క్రితమే కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇలాంటి తరుణంలో బీటెక్ రవికి బెయిల్ మంజూరు కావడంతో అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 25న నారా లోకేష్ పర్యటన సందర్భంగా కడప విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనలో బీటెక్ రవిపై 10 నెలల తర్వాత కేసు నమోదైంది.
టీడీపీ నేత, వైయస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి)కి బెయిల్ మంజూరైంది. కడప జిల్లా కోర్టు.. బుధవారం (నవంబర్ 29) బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసింది. నవంబరు 14 నుంచి కడప జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండు రోజుల కిందటే ఆయన రిమాండ్ పొడిగించారు. ఈ నేపథ్యంలో బీటెక్ రవికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నేడు రాత్రి జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.
10 నెలల కిందటి ఘటన.. అసలేం జరిగింది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి 2 రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. అయితే, ఎయిర్‌పోర్టులోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై సుమారు 10 నెలల తర్వాత వల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి బీటెక్ రవిని అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా కడప జిల్లా జైలుకు తరలించారు. బీటెక్ రవిని విడుదల చేయాలంటూ కుటుంబసభ్యులు, అనుచరులు ఆందోళన నిర్వహిస్తున్నారు. కడప జిల్లా కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.