ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి గురువారం నాటికి వాయుగుండంగా మారుతుందని తెలిపింది. అనంతరం, డిసెంబరు 2 కల్లా ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
కోస్తాంధ్రలో నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తీరానికి చేరుకోవాలని ఐఎండీ సూచించింది. డిసెంబరు 5 వరకూ చేపల వేటకు వెళ్లొదని హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 30న గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, డిసెంబరు 2న ఇవి 80 కి.మీ. చేరుకుంటాయని తెలిపింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కోస్తాంధ్ర, రాయలసీమలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
ఈ తుఫానుకు మాయన్మార్ ‘మిచౌంగ్’ అనే పేరును సూచించింది. డిసెంబరు 5 సాయంత్రం చెన్నైకు ఉత్తరంగా నెల్లూరు జిల్లా కావలి సమీపంలో అతి తీవ్ర తుఫాన్‌గా తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబరు 4న నైరుతి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. ఉత్తర ఈశాన్యం దిశగా పయనించి 5న సాయంత్రం కాకినాడకు దగ్గరలో తీరం దాటుతుందని కూడా భావిస్తున్నారు. వరి పంటలు కోతకు వచ్చిన సమయంలో అకాల వర్షాలు, అనుకోని తుఫాన్లు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబరు 4, 5, 6 తేదీల్లో పొలాల్లో పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.