ఆరోగ్య కార్మికులకు చట్టపరమైన రక్షణ కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. కొన్ని సమయాల్లో బంధువులు, రోగుల సంబంధీకుల నుంచి హింసను ఎదుర్కొనే ఆరోగ్య కార్యకర్తలకు తగిన చట్టపరమైన రక్షణలను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చని స్పష్టం చేసింది.ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలను పరిశీలించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హౌం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 115వ క్లాజ్ కింద నిబంధనలను ప్రవేశపెట్టాలని అభ్యర్థిస్తూ వివిధ వైద్య సంఘాలు సమర్పించిన మెమోరాండంపై చర్చించింది.
ఏ ఇతర వృత్తులలో కాకుండా, చికిత్స సమయంలో రోగులు మరణించిన సందర్భాల్లో ఆరోగ్య సంరక్షణ నిపుణులు రోగుల బంధువుల ద్వారా హింసాత్మక దాడులకు గురవుతారని ప్యానెల్ ముందు సమర్పించినట్టు కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై ఇటువంటి హింసాత్మక దాడులు దేశవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయనీ, ఆరోగ్య కార్యకర్తల ప్రయోజనాల కోసం కొన్ని చట్టపరమైన రక్షణలను అందించాల్సిన అవసరం ఉన్నదని వైద్య సంఘాలు కమిటీకి తెలిపాయి.
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తన ప్రతిస్పందనలో.. సాధారణ శిక్షా నిబంధనలు అందరికీ వర్తిస్తాయనీ, ఏ తరగతి వ్యక్తికి శిక్షా చట్టాలలో ఎటువంటి వ్యత్యాసం చూపబడదని పేర్కొన్నది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని హౌం మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ప్రత్యేక సదుపాయం కల్పించడం వలన మీడియా వ్యక్తులు, న్యాయవాదులు, బ్యాంకర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి ఇతర నిపుణుల నుంచి ఇలాంటి డిమాండ్లు తలెత్తవచ్చని హౌం మంత్రిత్వ శాఖ గమనించింది.