పంటలు పండించే నీళ్లతో రాజకీయ పంట పండించే ఆపార మేధావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీ.వీ ఆంజనేయులు ఎద్దేవ చేశారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...నాగార్జున సాగర్ కుడి కాలువకు, ఎడమ కాలువకు తేడా తెలియని మంత్రులు ఏపీలో ఉన్నారన్నారు. అసలు నీళ్లే లేని చోట వివాదాలా అని ప్రశ్నించారు.ఏపీ హక్కులను నాలుగున్నరేళ్లుగా తాకట్టు పెట్టి ఇప్పుడు నీటి వివాదాన్ని రెచ్చగొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టాకు ఆరుతడి పంటకైనా నీరివ్వాలని రైతులు ఆందోళన చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా సీఎం జగన్ మౌనం వహిస్తూ ఇప్పుడు పోలీసులతో దండయాత్ర చేయించడంలో ఆంతర్యం ఏమిటి అని జీ.వీ ఆంజనేయులు నిలదీశారు.