కర్నూలు జిల్లా, కోసిగిలోని 9వ వార్డు గాంధీనగర్‌కు చెందిన ఎల్లిపాయల జిల్లెడాకుల నాగరాజు (23) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కోసిగిలో చోటు చేసుకుంది. సీఐ ఎరిషావలి, ఎస్ఐ సతీష్ కుమార్ల వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు, నరసమ్మల కుమారుడు నాగరాజు కోసిగిలోని నరసింహ స్వామి ట్రేడర్స్‌లో హమాలీగా పని చేస్తున్నాడు. తనకు ఉన్న ట్రాలీ ఆటోలో కొనుగోలుదారుల ఇళ్లకు సిమెంట్, ఇనుము చేరవేస్తుంటాడు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో పల్సర్ బైకుపైన టీవీఎస్ షోరూం వెనుక భాగంలో బహిర్భూమికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో అప్పటికే కాపు కాచి ఉన్న కొందరు దుండగులు వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్‌లను సంఘటనా స్థలానికి పిలిపించి తనిఖీలు చేశారు. వివాహేతర సంబంధం కారణంతోనే యువకుడిని హత్య చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. నాగరాజు తండ్రి ఆంజనేయులు గతంలో చనిపోయాడు. తల్లి నరసమ్మ, భార్య చిట్టెమ్మ, ఇద్దరు చిన్నకూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరిషావలి, ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో ఎస్బీ ఏఎస్ఐ విజయకుమార్, ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, తదితరులు ఉన్నారు.