కృష్ణా జలాల వివాదం కేసు విచారణను జనవరి 12వ తేదీ వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలిపారు. కృష్ణ ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్నిఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేయనున్నది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.