పోలింగ్ రోజున డైవర్ట్ చేయడానికి నీటి పంపకాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాటకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరని తప్పకుండా గుణపాఠం చెబుతారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కరువు కాటకాలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 687 మండలాల్లో కరువు ఉందని నివేదికలు చెప్తున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందని చెప్పారు. ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని గిడుగు రుద్రరాజు తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. పల్నాడు, కర్నూలులో రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కరువు కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఉపాధి లేక సొంతుల్ల నుంచి వలస పోతున్నారు.నీళ్ళ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. తెలంగాణలో పోలింగ్ జరిగే రోజున ఇలాంటి గొడవలు చేయడం దురదృష్టకరమని గిడుగు రుద్ర రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.