ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యానంద దెబ్బకు పదవి కోల్పోయిన ఓ దేశ మంత్రి

national |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 10:28 PM

అత్యాచారం, మానవ అక్రమ రవాణా వంటి ఆరోపణలు ఎదుర్కొని, దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన మాయమాటలకు బుట్టలో పడిపోయిన ఓ దేశ మంత్రి తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. నిత్యానంద స్థాపించిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పుకున్నారు. మరోవైపు, ఇదే తరహాలో దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను ఆయన తప్పుదోవపట్టించినట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది తొలినాళ్లలో జెనీవాలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తాము యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధులమని చెప్పి ఓ మహిళ సహా ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాసతో దౌత్య సంబంధాలకు ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై ఆ దేశ సార్వభౌమత్వం, స్వతంత్ర దేశంగా గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పేర్కొంటూ పరాగ్వే మంత్రి అర్నాల్డో చమర్రో ఓ ఒప్పందంపై సంతకం చేశారు. అయితే, పరాగ్వేలో దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదో కుంభకోణమని సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


ఈ పరిణామాలతో మంత్రి ఆర్నాల్డో తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా, కెనడాకు చెందిన స్థానిక నేతలతోనూ కైలాస ప్రతినిధులు ఇదే తరహాలో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు భోగట్టా. వివాదంపై పరాగ్వే మంత్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అసలు కైలాస దేశం ఎక్కడుందో తనకు తెలియదని, పరాగ్వేకు మౌలిక సౌకర్యాలు, నీటి పారుదలకు సంబంధించిన ఆర్ధిక సాయం చేస్తామని ఆ ప్రతినిధులు ముందుకు రావడంతో తాను సంతకం చేశానని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను సోషల్ మీడియాలో నిత్యానంద శిష్యగణం షేర్ చేయడంపై తీవ్ర దుమారం రేగింది. గతంలో అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్‌ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధుల ఇదే విధంగా మోసం చేశారు. ఈ మేరకు నెవార్క్‌ నగర యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది.


అత్యాచారం సహా పలు కేసులను ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్‌లో లుకౌట్ నోటీసులు ఉన్నాయి. దీంతో ఆయన 2019లో దేశం విడిచి పారిపోయారు. తర్వాత ఈక్వెడార్‌ సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు ఇంటర్‌ పోల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆ ద్వీపానికే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస అని పేరు పెట్టి.. తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు, సొంతంగా కరెన్సీ, రిజర్వ్‌ బ్యాంకు, ఫ్లాగ్, పాస్‌పోర్టును తీసుకొచ్చారు. అనంతరం కైలాస ప్రతినిధిగా చెబుతూ.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. కైలాస తన దేశంలో స్థిరమైన అభివృద్ధి కోసం పురాతన హిందూ విధానాలు, స్వదేశీ పరిష్కారాలను అమలు చేస్తోందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com