ఏడాదికి కిందట చనిపోయిన తమ తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా.. శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని అక్కాచెల్లెళ్లు జీవనం సాగిస్తోన్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసి నగరంలో బుధవారం వెలుగుచూసింది. వారణాసి నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి (52) అనే మహిళ.. తన ఇద్దరు కూతుళ్లు పల్లవి (27), వైశ్విక్ (18)లతో కలిసి ఓ ఇంట్లో ఉంటోంది. రెండేళ్ల కిందటే ఆమె భర్త కుటుంబాన్ని వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో చిన్నదుకాణం నడుపుతూ పిల్లలను పోషించేది. పెద్ద కుమార్తతె పల్లవి పీజీ పూర్తిచేయగా.. వైశ్విక్ పదో తరగతి చదువుతోంది.
కాగా, గతేడాది డిసెంబరులో ఉషా అనారోగ్యంతో మృతిచెందగా.. ఈ విషయాన్ని అక్కాచెల్లెళ్లు ఎవరీకి చెప్పలేదు. అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. అవసరమైన వస్తువుల కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. మీర్జాపుర్‌లో ఉండే ఉషా సోదరుడు ధర్మేంద్ర కుమార్ బుధవారం వారి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చనిపోయిన విషయం బయటపడింది. చెల్లెల్ని చూసేందుకు వారణాసికి వచ్చిన ఆయన.. వారు ఉంటోన్న ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా... ఓ గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు కనిపించారు. స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. ఆ ఇద్దరి అక్కాచెల్లెళ్ల మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడం కాస్త అనుమానంగా ఉందని చెప్పారు. పల్లవి, వైశ్విక్‌లను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వివరించారు. రెండేళ్ల కిందట ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని, భార్య చనిపోయినా అతడు రాలేదన్నారు. అక్కాచెల్లెళ్లు గతవారం రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదని స్థానికులు చెబుతున్నారని మిశ్రా అన్నారు.