తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాన్ని సృష్టించేందుకు కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని, నాగార్జున సాగర్‌పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. నాగార్జున సాగర్‌పై ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని, రాష్ట్ర హక్కును కాపాడుకునే ప్రయత్నం చేశామన్నారు. సాగర్ కుడి కెనాల్‌ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధమన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి రాజకీయపరమైన ముడిపెట్టడం తగదన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయన్నారు. తెలంగాణలో వైయస్ఆర్ సీపీ లేదని, అక్కడ పోటీ చేయలేదని, అలాంటప్పుడు ఏపార్టీని ఓడించాల్సిన అవసరం తమకు ఉండదన్నారు. ఏపీ వాటాకు మించి ఒక్క నీటి బొట్టును కూడా వాడుకోబోమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.