కడప జిల్లాలో ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న ఓ సంచిని నల్లకట్ల వెంకటసుబ్బయ్య అనే ఆటో డ్రైవర్ పోలీసులకు అప్పగించాడు. సంచిలో రూ.2 లక్షలు విలువైన బంగారు నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లా పెనగలూరు మండలం మూగవారిపల్లెకు చెందిన సురేష్ కుటుంబ సభ్యులతో శనివారం స్వగ్రామం నుంచి ఆటోలో సిద్దవటం మండలంలోని జంగాలపల్లెలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. మార్గంలో నగల సంచి పోగొట్టుకున్నారు. సిద్దవటం మండలంలోని కమ్మపాలెంకు చెందిన నల్లకట్ల వెంకటసుబ్బయ్య అనే ఆటో డ్రైవర్ సిద్దవటంలోని వంతెన మీదుగా ఆటోలో వెళుతూ పోలీసుస్టేషన్ క్రాస్‌రోడ్డులోని స్పీడ్ బ్రేకర్ దగ్గర ఓ సంచిని గుర్తించారు. అనుమానంతో ఆటో నిలిపి సంచిని పరిశీలించగా ఆధార్‌కార్డు, ఇతర వస్తువులతోపాటు చిన్నపాటి సంచిలో బంగారు నగలు ఉన్నాయి. వెంటనే వాటిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి సంచిని పోలీసులకు అప్పగించారు. వెంటనే పోలీసులు ఆ సంచిని పరిశీలించి అందులో నుంచి ఆధార్‌కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా సురేష్ కుటుంబ సభ్యుల వివరాలు గుర్తించి వారిని పోలీసుస్టేషన్‌కు రప్పించి వస్తువులు అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ వెంకటసుబ్బయ్యను అభినందించారు. అలాగే సుబ్బయ్యకు సురేష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.