మిచాంగ్ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సీఎం వైయస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ఐదు జీఓలు, ఒక మెమో విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుపాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రూ.11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జీఓ నంబరు 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది.