ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేశారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభ చైర్మెన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ సస్పెన్షన్ రద్దు చేశారు. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా విధించిన సస్పెన్షన్ కారణంగా ఇంతవరకూ ఆయనకు పడిన శిక్ష సరిపోతుందని, సోమవారం నుంచి ఆయన సస్పెన్షన్ రద్దు చేసే విషయాన్ని సభ పరిశీలించాలని ఆ తీర్మానంలో ఆయన పేర్కొన్నారు.
సస్పెన్షన్‌ను రద్దు చేయాలని రాజ్యసభ చైర్మెన్ తీసుకున్న నిర్ణయంపై రాఘవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. 115 రోజుల సస్పెన్షన్ కాలంలో తనను ఆదరించి, ఆశీస్సులందించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను సాగిస్తున్న పోరాటానికి అందరూ ధైర్యమిచ్చారని అన్నారు. గత ఆగస్టు 11న రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెండయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ (సవరణ)-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
రాజ్యసభ నేత పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బేషరతు క్షమాపణకు ఆయన అంగీకరించడంతో ఆయన క్షమాపణను సానుకూలంగా పరిశీలించాలని రాజ్యసభ చైర్మెన్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.