రాయదుర్గంలో ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బస్సుయాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయి. మంత్రులు గుమ్మనూరు జయరామ్, ఉషశ్రీచరణ్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ తదితరులు బహిరంగసభలో పాల్గొన్నారు. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. ముందుగా శాంతినగర్‌లోని వైఎస్ విగ్రహానికి మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి వేలాది మందితో ప్రారంభమైన బస్సు యాత్ర తేరుబజారులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంది. అప్పటికే వేలాది మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. వారికి యాత్రలో వచ్చిన ప్రజలు కలిసి ఆ ప్రాంతమంతా జనసంద్రంలా కనిపించింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పడంతో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షం వ్యక్తమైంది. మనకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు.