మిచౌంగ్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడిన జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుతున్న సాయం, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందన్న సీఎం.. తుపాను వలన భారీవర్షాలు కురిసినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. వరద బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలన్న సీఎం.. మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏ సాయం ఆశిస్తామో, ఆ తరహా సహాయం అందించాలని కలెక్టర్లకు వివరించారు. పరిహారం అందించే విషయంలో సానుభూతితో ఉండాలన్న జగన్.. రుణసాయం ఎక్కువైనా మంచి సాయం అందాలని ఆదేశించారు.
మరోవైపు రేషన్ పంపిణీలో లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పంటపొలాల్లో ఉన్న వరదనీటిని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవటంపై దృష్టిసారించాలని ఆదేశించారు.తుపాను కారణంగా చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణాను పునరుద్ధరించాలని, సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ జిల్లాలో చెట్టు కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి 30 లక్షల పరిహారం అందజేస్తామని వెల్లడించారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు రైతులంతా ధైర్యంగా ఉండాలన్న సీఎం జగన్.. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.