రాజస్థాన్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడించి గద్దె దింపిన బీజేపీ.. ముఖ్యమంత్రి ఎంపికపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. రాజస్థాన్ సీఎం పీఠంపై కన్నేసిన సీనియర్ నేతలు.. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే పలువురు కేంద్రమంత్రులతోపాటు.. మాజీ సీఎం వసుంధర రాజే కూడా సీఎం రేసులో ఉన్నారు. అయితే గత అనుభవం, మహిళ కావడం.. వసుంధర రాజేకు కలిసి వచ్చే అంశాలుగా మారాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే సీఎం ఎంపికపై విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి.
రాజస్థాన్ సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ముందు వరుసలో ఉన్నారు. ఆమెతోపాటు కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, అర్జున్‌రామ్ మేఘవాల్ సహా ఓం ప్రకాష్ మాథుర్, బాబా బాలక్‌నాథ్ వంటి వారి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం వసుంధర రాజే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆమె తన కుమారుడు దుష్యంత్ సింగ్‌తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దాదాపు గంటన్నర పాటు వారి మధ్య సమావేశం జరిగింది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన వసుంధర రాజే, దుష్యంత్ సింగ్ ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సమావేశం తర్వాత బయటికి వచ్చిన వసుంధర రాజే ముఖంలో మాత్రం చిరునవ్వు కనిపించడంతో రాజస్థాన్ పీఠం ఆమెకే దక్కవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వారి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే రాజస్థాన్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కూడా బీజేపీ హై కమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు మాజీ సీఎం వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా తన కుమారుడిని రిసార్ట్‌లో బంధించారని కిషన్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే లలిత్ మీనా తండ్రి హేమ్‌రాజ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అదే విధంగా అతనితోపాటు మరో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచారనే వార్తలు బయటికి రావడం రాజస్థాన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
అయితే ఈ ఆరోపణలపై వసుంధర రాజే స్పందించారు. తనపై, తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. అవన్నీ అబద్ధాలని.. నిరాధారమైనవని వసుంధర రాజే కొట్టిపారేశారు. మరోవైపు.. రాజస్థాన్ సీంగా బీజేపీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందో అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన వేళ.. మెజారిటీ అభిప్రాయాలు మాత్రం వసుంధర రాజే వైపు చూపిస్తుండటం గమనార్హం. అదే జరిగితే రాజస్థాన్ సీఎం కుర్చీని వసుంధర రాజే మరోసారి దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. కమలం వర్గాల్లో చర్చ జరుగుతోంది.