గత కొన్నేళ్లుగా ఏపీలో రాజకీయం కాపుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అత్యధిక జనాభా ఉన్న కాపులను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు, పార్టీలు చేయని ప్రయత్నం ఉండదంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలం పెరుగుతున్న తరుణంలో కాపులను తమ వైపు తిప్పుకునేందుకు మిగతా పార్టీలు కూడా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కాపులపై పొగడ్తలు గుప్పించారు.
రేపల్లెలో కాపులు నిర్వహించిన కార్తీక సమారాధనలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కాపులపై పొగడ్తలు గుప్పించారు. తాను రాజకీయంగా ఈ స్థితిలో ఉండటానికి కాపులే కారణమని ఆయన తెలిపారు. తనను తన సొంత సామాజికవర్గం కంటే కాపులే ఎక్కువగా ఆదరించారని ఆయన వ్యాఖ్యానించారు. ‘నా సామాజికవర్గం కూడా నాకు 90 శాతం సహకరించిన దాఖలాల్లేవు. కానీ కాపు సామాజికవర్గం నాకు 90 శాతం సహకరించింది. నేను పోటీ చేసిన ప్రతిసారి కొన్ని గ్రామాల్లో నూటికి 90 శాతం నాకు సపోర్ట్ చేశారు. 2009 నుంచి మారిన పరిస్థితుల వల్ల నేను కూడా మీకెప్పుడూ మోపిదేవి వెంకటరమణ రావులా కాకుండా మోపిదేవి వెంకటరమణరావు నాయుడిలా అండగా ఉంటాను’ అంటూ కాపులను ఓన్ చేసుకుంటూ మోపిదేవి వ్యాఖ్యానించారు. దివంగత నేత, కాపులు ఆరాధనీయుడిగా భావించే వంగవీటి మోహన రంగా అందరికీ ఆదర్శప్రాయుడన్న మోపిదేవి.. త్వరలోనే రేపల్లెలో వంగవీటి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు.
మోపిదేవి వెంకటరమణ బీసీ సామాజికవర్గమైన అగ్నికుల క్షత్రియ కులానికి చెందినవారు. మోపిదేవి 1999 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. కానీ శాసనమండలిని రద్దు ఆలోచనలతో మోపిదేవి ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో జగన్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడినప్పటికీ.. 2024లో రేపల్లెలో ఎలాగైనా వైఎస్సార్సీ జెండా ఎగరేయాలని మోపిదేవి పట్టుదలతో ఉన్నారు.
రేపల్లెలో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. టీడీపీ-జనసేన కలిసి బరిలోకి దిగనున్నాయి. అదే జరిగితే కాపులు ఈ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే మోపిదేవి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు తన కొడుకు రాజీవ్‌ను రాజకీయాల్లోకి తేవాలనే ఆలోచనలోనూ మోపిదేవి ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపులను ప్రసన్నం చేసుకోవడం కోసం మోపిదేవి ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.