ఆధార్ కార్డు పొందడానికి వేలిముద్రలు తప్పనిసరిగా కావాలి. అయితే వేళ్లు లేని వారు.. వేలి ముద్రలు సరిగా పడని వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వేళ్లు లేవని, వేలి ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్‌ను తిరస్కరించలేరని స్పష్టం చేశారు. తనకు చేతి వేళ్లు లేని కారణంగా ఆధార్‌లో పేరు నమోదు చేయించుకోలేక పోతున్నానంటూ కేరళకు చెందిన జోసిమల్ పీ జోస్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందించారు.
కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోం పట్టణంలో వేళ్లు లేని జోసిమోల్ పి.జోస్ అనే మహిళ ఇంటికెళ్లి సిబ్బంది ఆధార్ నమోదు చేసిన విషయాన్ని శనివారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. ఆమె విషయంలో మంత్రి జోక్యం చేసుకుని ఆధార్ ఇప్పించారు. వేలి ముద్రలు ఇవ్వలేని వాళ్లు ఐరిస్ స్కాన్ ద్వారా ఐరిస్ సరిగా రానివాళ్లు వేలిముద్రల ద్వారా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎవరికైనా వేలి ముద్రలు, ఐరిస్ రెండూ లేకపోతే అవి లేకుండానే ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
అలాంటివారు బయోమెట్రిక్ ఎక్సెప్షన్ ఎన్‌రోల్‌మెంట్ గైడ్‌లైన్స్ కింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. ఆ వివరాలతో కూడిన బయోమెట్రిక్స్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. వాళ్ల దగ్గర ఏయే అంశాలు లేవో ఆ వివరాలను ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడంతోపాటు.. మార్గదర్శకాలకు అనుగుణంగా ఫొటోగ్రాఫ్ తీసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన అనంతరం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సూపర్‌వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుందని వెల్లడించారు.
ఇక జోసిమల్ చేసిన విజ్ఞప్తితో అదే రోజే యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు. కొట్టాయం జిల్లాలోని కొమరకంలో ఆమె ఇంటికి వెళ్లి ఆధార్ నెంబర్‌ను నమోదు చేయించారని రాజీవ్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జోసిమల్‌లా ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా ఉన్నా వేలి ముద్రలు సరిగా పడకపోయినా ఇతర ఏదైనా వైకల్యం కారణంగా ముద్రలు వేయలేకపోయినా ఇతర ప్రత్యామ్నాయ బయోమెట్రిక్ విధానాల ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలని అన్ని ఆధార్ సర్వీస్ కేంద్రాలకు సలహా జారీ చేసినట్టు చెప్పారు.