స్మార్ట్ సిటీ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అమరావతి నగరాల్లో 6865 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయస్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ రాష్ట్రంలో ఎంపికైన నాలుగు నగరాల్లో మొత్తం 283 అభివృద్ధి ప్రాజెక్టులు కేటాయించగా 4742.43 కోట్ల వ్యయంతో చేపట్టిన 224 పనులు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 2122.98కోట్లతో చేపట్టిన మిగిలిన 52 ప్రాజక్టు పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మొత్తం ప్రాజెక్టులకు ఇప్పటికి 3538 కోట్లు నిధులు విడుదల చేయగా 2951 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తిరుపతిలో 1999.94 కోట్లతో 109 ప్రాజెక్టులు చేపట్టగా 1,532.41 కోట్లతో చేపట్టిన 80 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 467.53 కోట్లతో చేపట్టిన మిగిలిన 29 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం 578 కోట్లు విడుదల చేయగా 550.48 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే కాకినాడలో 1,910.24 కోట్లతో చేపట్టిన 94 ప్రాజెక్టుల్లో 1,674.04 కోట్లతో 76 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 236.20 కోట్లతో చేపట్టిన మిగిలిన 18 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. మొత్తం ప్రాజెక్టులకు 978కోట్లు విడుదల చేయగా 783.57 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో 2,025.23 కోట్లతో చేపట్టిన మొత్తం 61 ప్రాజెక్టులకు 908.84 కోట్లతో 56 ప్రాజెక్టులు పూర్తికాగా 1,116.39 కోట్లతో చేపట్టిన మిగిలిన 5 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. అభివృద్ధి పనులు కోసం 966 కోట్లు విడుదల చేయగా 838.47 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అమరావతిలో 930 కోట్లతో చేపట్టిన 19 ప్రాజెక్టులకు 627.14 కోట్లతో 12 ప్రాజెక్టులు పూర్తి చేయగా 302.86 కోట్లతో చేపట్టిన మిగిలిన 7 ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం 1,016కోట్లు విడుదల చేయగా 779.29 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్‌ను 2015 జూన్ 25న ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన నగరాలతోసహా దేశంలో 100 నగరాలను ఎంపిక చేసిందని మంత్రి తెలిపారు. 2016 జనవరి నుంచి 2018 జూన్ వరకు 4 రౌండ్లలో పోటీ అనంతరం 100 నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 2023 నవంబర్ 27 నాటికి 1,71,224 కోట్లతో 7959 ప్రాజెక్టులకు సంబంధించి వర్క్ ఆర్డర్లు ఇవ్వగా 1,16,269 కోట్ల వ్యయంతో చేపట్టిన 6271 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన 78,749.88 కోట్లకుగాను 71,135.70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.