చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అప్పు చెల్లించలేదంటూ ఓ వ్యక్తిని లాడ్జికి తీసుకెళ్లి నిర్భంధించారు. ఓ ప్రైవేట్ లాడ్జిలో సదరు వ్యక్తిని బంధించిన దుర్మార్గులు.. కనీసం తిండికూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. దారుణంగా హింసించారని బాధితుడు వాపోయాడు. అయితే బాధితుడి భార్యా చొరవతో ఈ ఉదంతం బయటపడింది. మనోడు బయటకు రాగలిగాడు.. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన తిరుమలేష్ అనే యువకుడు బుజ్జి అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పును తీర్చకపోవటంతో గత కొంతకాలంగా బుజ్జి వేధిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అప్పు చెల్లించలేదని తిరుమలేష్ను బుజ్జి బంధించాడు. ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉంచి చిత్రహింసలు పెట్టాడు. గదిలో పెట్టి చితకబాదినట్లు బాధితుడు చెప్తున్నాడు. తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసిసినట్లు తిరుమలేశ్ ఆరోపిస్తున్నాడు. కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదని వాపోయాడు. అయితే భర్త మూడురోజులైనా రాకపోవటంతో తిరుమలేష్ భార్యకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తన భర్త అప్పు చేసిన వివరాలు, బుజ్జి వేధింపులను పోలీసులకు తెలియజేసింది. తిరుమలేష్ భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రైవేట్ లాడ్జిలో తిరుమలేష్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకుని అతన్ని విడిపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బుజ్జి అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.