ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి పేరుతో పేదల ఆకలి తీరుస్తున్న కుమారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 06:48 PM

పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కుమారులు మన సమాజంలో ఎంతో మంది ఉంటారు. కన్నవాళ్లు తమ మధ్య లేకపోయినా, వారి ఆశయాలను కొనసాగించేందుకు అనునిత్యం తాపత్రయపడే కుమారులు కూడా ఎంతో మంది ఉంటారు. ఈ కోవకు చెందిన వారే.. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ సోదరులు. తమ తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ.. నిత్యం వందలాది మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. నెల్లూరు ఆస్పత్రిలో రోగుల బంధువులకు, పేదలకు రోజూ కడుపునిండా భోజనం పెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ కార్యాన్ని కొనసాగిస్తున్నారు.


ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం చెన్నబోయినపల్లెకు చెందిన కోట శివరామయ్య 1989లో నెల్లూరు నగరానికి వలస వచ్చారు. సంతపేట ప్రాంతంలో సింహపురి హార్డ్‌వేర్ దుకాణం ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధిస్తూనే తనవంతుగా పేద ప్రజలకు సాయం చేసేవారాయన. శివరామయ్య కాలం చేశాక ఆ వ్యాపార నిర్వహణ బాధ్యతలను ఆయన కుమారులు సూర్యనారాయణ, రమేష్‌ బాబు చేపట్టారు. సమర్థంగా పనిచేసి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో.. తండ్రి బాటలోనే తాము కూడా ఆదాయంలో కొంత భాగాన్ని పేద ప్రజలకు కేటాయించాలని నిర్ణయించుకున్నారు సూర్యనారాయణ, రమేష్ బాబు. అనుకున్నదే తడవుగా తండ్రి పేరుతో చారిటబుల్ ట్రస్ట్‌ నెలకొల్పారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ‘సింహపురి భోజనశాల’ ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే పేద, మధ్య ప్రజలకు కడుపునిండా భోజనం పెడుతున్నారు.


ఒక్కో ప్లేటు భోజనాన్ని కేవలం 20 రూపాయలకు అందిస్తున్నారు. ఉచితంగా పెట్టే స్తోమత ఉన్నప్పటికీ.. అన్నం వృథా కాకూడదనే భావనతో ఇలా చేస్తున్నారు. అంతేకాకుండా.. హోటల్ నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం ఆ స్వల్ప మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక ప్లేటు భోజనం తయారీకి తమకు 60 నుంచి 70 రూపాయలు ఖర్చు అవుతుందని వారు తెలిపారు. అయితే, పేద ప్రజల కడుపు నింపాలన్న ఉద్దేశంతో 20 రూపాయలకే భోజనం అందిస్తున్నామని సూర్యనారాయణ, రమేష్‌ బాబు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులకు సిబ్బంది భోజనం అందిస్తారు. అయితే, వారికి తోడుగా వచ్చిన వారు మాత్రం సొంత డబ్బులతో బయటే భోజనం చేయాల్సి వస్తోంది. ఆస్పత్రి చుట్టుపక్కల ఎక్కడ భోజనం చేయాలన్నా 100 రూపాయల పైనే ఖర్చవుతోంది. అలాంటి వారికి ఈ సింహపురి భోజనశాల అండగా నిలుస్తోంది.


ఆస్పత్రికి వచ్చేవారే కాకుండా వివిధ పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చే పేదలు, చుట్టుపక్కల షాపుల్లో పని చేసేవారు, పక్కనే గ్రౌండ్‌లో ఆటలు ఆడుకునేందుకు వచ్చే పేద విద్యార్థులు సైతం ఇక్కడ తమ ఆకలి తీర్చుకుంటున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకెళ్లా అన్నదానం ఉత్తమమైనది. ఆకలితో ఉన్న మనిషికి ఆహారం అందించడం కంటే గొప్ప సేవ ఏముంటుంది..? ధనార్జనే తప్ప సాటి మనిషి గురించి పట్టించుకోని నేటి సమాజంలో తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ పేదల ఆకలి తీరుస్తున్న ఈ సోదరులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదూ..!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com