లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాగా భావించే పార్లమెంట్‌లోకి ఆగంతకుల చొరబాటు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విజిటర్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన దుండగులు స్పీకర్ కూర్చున్న వెల్ వైపుగా దూసుకెళ్లారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన కొంతమంది ఎంపీలు బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు. మరికొందరు ఎంపీలు దుండగులను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే వారిని అడ్డుకోవడంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా తెలివిగా వ్యవహరించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి దుండగులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
దుండగుల్లో ఒకరైన సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకాడు. ఆ తర్వాత ఎంపీలు కూర్చునే సీట్ల మీద ఎగురుకుంటూ స్పీకర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎంపీలు చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో యెల్లో కలర్ స్మోక్ వదిలాడు. దీంతో అప్పటికే భయంతో ఉన్న ఎంపీలు మరింత భయపడిపోయారు. సభ నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నం చేశారు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చిన కొంతమంది ఎంపీలు దుండగుణ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన సమయంలో సభలోనే ఉన్న వైసీపీ ఎంపీ, హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దుండగుణ్ని అదుపులోకి తీసుకున్న గోరంట్ల మాధవ్ చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో.. గోరంట్ల మాధవ్‌ను సహచర ఎంపీలు అభినందించారు.
ఈ ఘటనపై గోరంట్ల మాధవ్ స్పందించారు. జీరో అవర్‌లో ఈ ఘటన జరిగిందన్న వైసీపీ ఎంపీ.. వెనుక ఉన్న విజిటర్స్ గ్యాలరీ నుంచి దుండగులు కిందకు దూకినట్లు వెల్లడించారు. బెంచ్‌లను దాటుకుంటూ స్పీకర్ వైపు వెళ్లే ప్రయత్నం చేసినట్లు వివరించారు. అనంతరం యెల్లో కలర్ స్మోక్ వదిలినట్లు తెలిపారు. అయితే ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఆగంతకుణ్ని అడ్డుకున్నారన్న గోరంట్ల మాధవ్.. తాను కూడా వారితో కలిసి దుండగుణ్ని బంధించినట్లు తెలిపారు. ఆ సమయంలో దుండగుడు బెల్ట్ బాంబ్ లాంటిది ఏమైనా పెట్టుకుని వచ్చాడా అనే డౌట్ వచ్చినట్లు గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఏదేమైనా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్న హిందూపురం ఎంపీ..పార్లమెంటులో భద్రతను మరింత పటిష్టం చేయాలని కోరారు.
మరోవైపు రాజకీయాల్లోకి రాకముందు గోరంట్ల మాధవ్ పోలీస్‌గా పనిచేశారు. సీఐగా సర్వీసులో ఉండగానే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోవైపు గతంలో పోలీస్‌గా పనిచేసిన అనుభవమే.. బుధవారం నాటి ఘటనలో ఉపయోగపడిందని గోరంట్ల మాధవ్ అన్నారు. ఆ ధైర్యంతోనే దుండగుడికి ఎదురు వెళ్లినట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో ప్రతి వ్యక్తి కూడా పోలీస్‌లాగా వ్యవహరించాలని సూచించారు.