మొబైల్ ఫోన్.. ఇప్పుడు నిత్యజీవితంలో భాగమైపోయింది. జీవితంలో భాగమైంది అనేకంటే.. శరీరంలో భాగమైంది అని అనడం కరెక్టేమో. ఎందుకంటే పొద్దున నిద్ర లేచింది మొదలు.. రాత్రి మళ్లీ పడుకునే వరకూ మన శరీరంలో ఒక భాగం మాదిరిగా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి సెల్‌ఫోన్‌ను వేలకువేలు పోసి కొనుగోలు చేస్తుంటాం. ప్రైవసీ కోసం పాస్‌వర్డ్‌లు, స్క్రీన్ లాక్‌లు పెడుతుంటాం. కానీ.. ఫోనే పోతే ఏంటి పరిస్థితి అంటే సమాధానం శూన్యం. ఫోన్ పోగొట్టుకున్నవాడి పరిస్థితి ప్రపంచం మొత్తం తలకిందులైనట్లే ఉంటుంది. అయితే ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన ఓ కార్యక్రమం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది.
అధునాతన సాంకేతికత సాయంతో పోయిన ఫోన్లను ఏపీ పోలీసులు రికవరీ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే.. ఇంట్లో నుంచే ఫోన్ తిరిగి పొందేలా ఏర్పాట్లు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండా.. ఇంట్లో కూర్చొని చాట్ బాట్ టెక్నాలజీతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బాధితులు మళ్లీ పొందవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల పోలీసులు ప్రత్యేక నెంబర్‌తో చాట్ బోట్ రూపొందించారు. సెల్‍ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు ఇందులో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు.. ఓ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా వెబ్‌సైట్లోకి వెళ్లి ఫోన్ వివరాలు సమర్పిస్తే పోలీసులు దర్యాప్తు మొదలెడతారు. మొబైల్ ఫోన్స్ రికవరీకి చర్యలు చేపడుతారు. ఈ విధానం ఇప్పుడు సక్సెస్ అవుతోంది. ఫోన్ పోగొట్టుకుని ఇక రాదని బాధితులు భావిస్తున్న సమయంలో మళ్లీ ఫోన్లు కనిపించేసరికి బాధితులు ఎగిరి గంతేస్తున్నారు.
ఈ విధానంలోనే విశాఖ పోలీసులు 80 లక్షల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ వివరాలను విశాఖ డీసీపీ వెల్లడించారు.దర్యాప్తులో భాగంగా రూ.80 లక్షల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్న ఆయన.. త్వరలోనే వాటిని యజమానులకు అందజేస్తామన్నారు.తక్కువ వ్యవధిలో 450 ఫోన్లను రికవరీ చేశామన్న విశాఖ పోలీసులు.. నగరంలో పోయిన ఫోన్లు దేశంలో, రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు కంగారు పడకుండా చాట్ బోట్ ద్వారా వివరాలు సమర్పిస్తే వీలైనంత త్వరగా ఫోన్ రికవరీకి ప్రయత్నిస్తామని వెల్లడించారు.